31, డిసెంబర్ 2015, గురువారం

సృజ‌నాత్మ‌క ఉపాధ్యాయులు - సైన్స్ ముగ్గుల పోటీ నిర్వ‌హించిన శ్రీ ఆనంద్‌బాబు

ఉపాధ్యాయుల సృజ‌నాత్మ‌క విధానాల‌ను ఎంచుకున్న ఉపాధ్యాయుల‌ను గురించిన క‌ధ‌నాల‌ను మ‌న బ్లాగ్‌లో మ‌రియు శాస్త్ర‌చైత‌న్యం గ్రూపులో పంచుకోవాల‌నుకుంటున్నాను. ముగ్గుల ద్వారా సృజ‌నాత్మ‌కంగా విద్యార్ధుల‌లో సైన్స్ ప‌ట్ల ఆస‌క్తి పెంచ‌డానికి ప్ర‌య‌త్నించిన శ్రీ ఆనంద్ బాబుగారి క‌ధ‌నంతో ఈ వ్యాసాన్ని ప్రారంభిస్తున్నాను.
తూర్పు గోదావ‌రి జిల్లా సీతాన‌గ‌రం, ప్ర‌భుత్వ‌ పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులు శ్రీ‌ ఆనంద్ బాబు గారు నూత‌న సంవ‌త్స‌ర శుభాక్షాంక్ష‌ల‌ను విభిన్నంగా తెలియ‌చేసే ప్ర‌య‌త్నం చేశారు. విద్యార్ధులంద‌రినీ ముందుగానే సిద్ధం చేసి, చ‌క్క‌ని ముగ్గుల పోటీ నిర్వ‌హించారు. ఆ ముగ్గుల పోటీ సాధార‌ణ‌మైన‌ది అయితే మ‌న బ్లాగ్‌లో చ‌ర్చ‌కు వ‌చ్చేది కాదు. విశేషం ఏమంటే ఆ ముగ్గుల పోటీలో చ‌క్క‌ని రంగ‌వ‌ల్లుల‌కు బ‌దులుగా సైన్స్ పాఠ్యంశాల‌లో ఉన్న ప‌టాల‌ను అందంగా వేసి, రంగుల‌ను దిద్దాల్సి ఉంటుంది. పండ‌గ‌లా సాగిన ఈ స‌ర‌దా పోటీలో పాఠ‌శాల‌లో 9, 10వ త‌ర‌గ‌తులు చ‌దివే విద్యార్ధినీ విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 43 మ‌ంది విద్యార్ధులు అందమైన శాస్త్ర రంగ‌వ‌ల్లుల‌ను తీర్చిదిద్ది త‌మ ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ పోటీలో ఆర్బిటాళ్ల చిత్రాలు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఈ పోటీల‌ను నిర్వ‌హించ‌డాన‌కి త‌మ స‌హ‌కారాన్ని అందించిన పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు శ్రీమ‌తి కె.రామ‌ల‌క్ష్మి, మ‌రియు త‌మ స‌హోపాధ్యాయులు ముర‌ళీకృష్ణ‌, సత్య‌నారాయ‌ణ‌, వెంక‌న్నబాబు, రామ‌మూర్తి మ‌రియు సుజాత‌ గార్ల‌కు త‌మ ధ‌న్య‌వాద‌ముల‌ను తెలియ‌చేశారు.
ఇలాంటి విన్నూత్న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసిన శ్రీ ఆనంద్‌బాబు గారి (ఫోన్ +91 94406 90331) మీ అభినంద‌న‌ల‌ను తెలియ‌ప‌ర‌చండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి